Friday 8 May 2020

మాస్క్‌ లేకుంటే జరిమానా రూ.1,000

29 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

జోన్లవారీగా కొత్త సడలింపులు

రెడ్‌ జోన్లలో కొనసాగనున్న ఆంక్షలు 

@  కరోనా వైరస్‌ నిర్మూలనకు రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మే 7 నుంచి 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని, దీనిని ఉల్లంఘించిన ప్రతిసారీ రూ.1000 జరిమా నా విధిస్తారని స్పష్టంచేశారు.

*@  వీటికి రాష్ట్రమంతటా అనుమతి...*
నిత్యావసర వస్తువులైన ఆహార పదార్థాల క్రయ విక్రయాలు, ఉత్పత్తి, రవాణా, వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి వస్తువుల విక్రయాలు, వ్యవసాయ కార్యకలాపాలు, అంతర్రాష్ట్ర, రాష్ట్రం అంతర్భాగంలో వస్తువుల రవాణా, ఆస్పత్రులు, క్లినిక్స్, మందుల దుకాణాలు, వైద్య పరీక్షల కేంద్రాల నిర్వహణ, ఉపాధి హామీ పనులు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలికం, ఇంటర్నెట్, పోస్టల్‌ సేవలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, అత్యవసర వస్తువుల సప్లై చైన్‌ కొనసాగింపు, పెట్రోల్‌ పంపులు, ఎల్పీజీ– వీటి నిల్వలు, రవాణా సంబంధిత కార్యకలాపాలు రాష్ట్రమంతా కొనసాగుతాయి.

♦ గ్రామీణ ప్రాంతాలు, ఆరెంజ్, గ్రీన్‌ జోన్ల పరిధిలో అన్ని నిర్మాణ పనులకు అనుమతి. జీహెచ్‌ఎంసీతో సహా ఇతర రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో వర్క్‌ సైట్ల వద్ద కార్మికుల లభ్యత ఉంటేనే పనులకు అనుమతి

♦ గ్రామీణ ప్రాంతాలు, ఆరెంజ్, గ్రీన జోన్ల పరిధిలో అన్ని రకాల పరిశ్రమలకు అనుమతి. స్టోన్‌ క్రషర్స్, ఇటుకల బట్టీలు, చేనేత, రిపేర్‌ పనులు, బీడీల తయారీ, ఇసుక ఇతరత్రా మైనింగ్, సిరామిక్‌ టైల్స్, రూఫ్‌ టైల్స్, సిమెంట్‌ పరిశ్రమలు, జిన్నింగ్‌ మిల్స్, ఐరన్, స్టీల్‌ పరిశ్రమలు, ప్లాస్టిక్, శానిటరీ పైపులు, పేపర్‌ పరిశ్రమలు, కాటన్‌ పరుపులు, ప్లాస్టిక్, రబ్బర్‌ పరిశ్రమలు, నిర్మాణ పనులకు అనుమతి.

♦ గ్రీన్, ఆరెంజ్‌ జోన్ల పరిధిలో అన్ని రకాల వస్తువుల ఈ–కామర్స్‌కు అనుమతి. జీహెచ్‌ఎంసీలో నిత్యావసర వస్తువుల ఈ–కామర్స్‌కు మాత్రమే అనుమతి.

♦ గ్రామీణ ప్రాంతాలతో పాటు గ్రీన్, ఆరెంజ్‌ జోన్ల పరిధిలో మాల్స్‌ మినహా అన్ని రకాల షాపులకు అనుమతి. రెడ్‌ జోన్లలో మినహాయించి మిగిలిన అన్ని పురపాలికల్లో ఒక రోజు విడిచి ఒక రోజు దుకాణాలను తెరవాలి. ఒకే రోజు పక్క పక్క షాపులు తెరవరాదు. రెడ్‌జోన్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర పురపాలికల్లో నిత్యావసర వస్తువుల షాపులతో పాటు కేవలం నిర్మాణ సామాగ్రి, హార్డ్‌వేర్, వ్యవసాయ పరికరాలు/యంత్రాలకు అనుమతి.

♦ రెడ్‌ జోన్‌ పట్టణ ప్రాంతాల్లోని సెజ్‌లు, ఎక్స్‌పోర్ట్‌ ఓరియంటెడ్‌ యూనిట్లు, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్పులు, ఔషధాలు, వైద్య పరికరాలు, వైద్య, ఔషధ సంబంధ ముడిసరుకులు తదితర నిత్యావసర, అత్యవసర వస్తువుల ఉత్పత్తి యూ నిట్లు, నిరంతరం నడవాల్సిన పరిశ్రమలు, ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తి, ప్యాక్డ్‌ వస్తువుల తయారీకి అనుమతి.

♦ జీహెచ్‌ఎంసీతో సహా ఇతర రెడ్‌జోన్‌ పరిధిలోని ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, ఇతర ప్రైవేటు కార్యాలయాలు 33 శాతం ఉద్యోగులతో పనిచేయాలి. మిగిలిన వారు ఇంటి నుంచే పని చేయాలి. గ్రీన్, ఆరెంజ్‌ జోన్ల పరిధిలో పూర్తి ఉద్యోగుల సామర్థ్యంతో పనిచేసేందుకు అనుమతి.

♦ గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి ఉద్యోగుల సామర్థ్యంతో పని చేయవచ్చు. అయితే, రెడ్‌జోన్ల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 100 శాతం మంది డిప్యూటీ సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులతో పని చేయాలి. అవసరాన్ని బట్టి మిగిలిన సిబ్బందిలో 33 శాతం మంది విధులకు హాజరు కావచ్చు. రక్షణ, భద్రత, వైద్య, కుటుంబ సంక్షేమ, పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్‌ ట్యాక్సులు, రిజిస్ట్రేషన్‌ స్టాంపులు, రెవెన్యూ, జైళ్లు, హోంగార్డులు, సివిల్‌ డిఫెన్స్, అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ, ఎన్‌ఐసీ, కస్టమ్స్, ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, ఎన్‌వైకే, మునిసిపల్, పంచాయతీరాజ్‌ శాఖలు ఎలాంటి ఆంక్షలు లేకుండా పనిచేయవచ్చు. అత్యవసర సేవలు కొనసాగాలి. ఆ మేరకు సిబ్బందిని వినియోగించుకోవాలి.

♦ రెడ్‌ జోన్ల పరిధిలో రెస్టారెంట్లు, బార్బర్‌ షాపులు, స్పా, సెలూన్స్‌కు అనుమతి లేదు. ట్యాక్సీలు, క్యాబ్, ఆటోరిక్షాలకు సైతం అనుమతి లేదు. గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి. ఆరెంజ్‌ జోన్లలో మాత్రమే కేవలం ఇద్దరు ప్రయాణికులతో ట్యాక్సీలకు అనుమతి.

*😷జోన్లతో సంబంధం లేకుండా వీటిపై నిషేధం..*
♦ దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు
♦ రైలు ప్రయాణాలు (చిక్కుకుపోయిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లకు మినహాయింపు)
♦ అంతర్రాష్ట్ర బస్సులతో ప్రజారవాణా. ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తుల రాకపోకలు (ప్రత్యేకంగా అనుమతి పొందినవారికి మినహాయింపు)
♦ అంతర్‌ జిల్లాతో పాటు జిల్లా లోపల బస్సు సేవలు
♦ మెట్రో రైళ్లు
♦ పాఠశాలలు, కళాశాలలు, విద్యా/శిక్షణ సంస్థలు
♦ హోటళ్లు, లాడ్జీల వంటి ఆతిథ్య సేవలు (వైద్య, పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు, చిక్కుకుపోయిన వ్యక్తులకు బస కల్పించే వాటికి మినహాయింపు)
♦ బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్‌ మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్‌ పూల్స్, స్పోర్ట్స్‌ కాంప్లెక్సులు, అమ్యూజ్‌మెంట్, జూ పార్కులు, మ్యూజియంలు, ఆడిటోరియంలు
♦ సామూహికంగా నిర్వహించే అన్ని రకాల సామాజిక, రాజకీయ, క్రీడల, వినోద, విద్య, సాంస్కృతిక కార్యకలాపాలు
♦ అన్ని ప్రార్థన స్థలాలు, మతపరమైన స్థలాలు
♦ అన్ని సామూహిక మతపర కార్యక్రమాలు
♦ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు ఎలాంటి జన సంచారానికి అనుమతి లేదు. అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు. ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా ఇతర దుకాణాలు/వ్యాపార సంస్థలను సాయంత్రం 6 తర్వాత, మూసేయాలి.  ఉత్తర్వుల కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి