Tuesday 14 July 2020

GOI-Guidelines for Digital Education

 *ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌పై కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు*
  

@న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో దేశంలో మూత‌ప‌డ్డ‌ విద్యాసంస్థలు ఎప్పటినుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌నే విష‌యంలో స్పష్టత కొర‌వ‌డింది. మరోవైపు కొన్ని పాఠ‌శాల‌లు, కళాశాల‌లు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్ర‌భుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ఎలాంటి విధానాన్ని రూపొందించలేదు. దీంతో ప‌లువురు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

@ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుద‌ల చేసింది. విద్యార్థులకు గంట‌ల త‌ర‌బ‌డి ఆన్‌లైన్ క్లాసులు బోధించ‌కుండా స్క్రీన్ టైమ్ కుందించాల‌ని హెచ్ఆర్డీ మినిస్ట్రీ సూచించింది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు రోజులో 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఆన్‌లైన్ బోధ‌న ఉండరాదని తెలిపింది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థుల‌కు రోజుకు రెండు ఆన్‌లైన్ సెషన్‌ల చొప్పున ఒక్కో సెష‌న్‌ 45 నిమిషాల వరకు ఉండొచ్చ‌ని.. 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల‌కు 30-45 నిమిషాలు ఒక చొప్పున‌ నాలుగు సెషన్‌లు మించ‌రాద‌ని కేంద్రం మార్గదర్శకాల్లో  పేర్కొన్నది.

@ కోవిడ్‌-19 సంక్షోభం కార‌ణంగా స్వ‌స్థ‌లాల‌కు తిరిగి వ‌చ్చిన వ‌ల‌స కార్మికుల పిల్ల‌ల విద్య‌కు సంబంధించి రాష్ర్టాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు మావ‌న వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ మార్గ‌ద‌ర్శ‌కాలను జారీ చేసింది. ఇతర రాష్ట్రాలకు లేదా రాష్ర్టంలోనే ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న వారి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిన కార్మికుల పిల్ల‌ల డేటా బేస్ ను సిద్ధం చేయాలని కోరింది. డేటాబేస్ లో అలాంటి చిన్నారుల‌ను మైగ్రేటెడ్ లేదా తాత్కాలికంగా అందుబాటులో లేరు అని పేర్కొనాలంది.

@ ప్ర‌తీ ఒక్క పాఠ‌శాల ఈ డేటాబేస్ ను త‌యారు చేయాలంది. వారి వారి పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న‌ పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌ను, లేదా సంర‌క్ష‌కుల‌ను ఫోన్‌, వాట్స‌ప్‌, ఇరుగుపొరుగు వారిని సంప్ర‌దించి డేటాబేస్‌ను త‌యారు చేయాలని పేర్కొంది. ఈ స‌మ‌యంలో వారు బ‌స చేసిన తాత్కాలిక స్థ‌లాన్ని కూడా గుర్తించాలంది. అటువంటి పిల్ల‌ల పేర్లు రిజిస్ట‌ర్ నుండి తొల‌గించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంది(ఎప్పుడైనా వారు తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో). మ‌ధ్యాహ్న భోజ‌నం, పుస్త‌కాలు, యూనిఫాం వంటి ఇత‌ర స‌దుపాయాలు అందుతున్న నేప‌థ్యంలో అటువంటి విద్యార్థుల నెంబ‌ర్ల‌ను త‌ర‌గ‌తుల వారీగా డైర‌క్టరేట్ ఆఫ్ ఎడ్యూకేష‌న్‌కు రిపోర్ట్ చేయాలంది.

@ ఇటీవ‌ల గ్రామానికి తిరిగి వ‌చ్చిన ఏ చిన్నారికైనా అడ్మిష‌న్ స‌మ‌యంలో ఏవో కొన్ని గుర్తింపు రుజువులు మినహా ఇతర ఏ పత్రాలు అడగకుండా చేర్చుకోవాల్సిందిగా రాష్ర్ట ప్ర‌భుత్వాలు పాఠ‌శాల‌ల‌కు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. టీసీ, ఇత‌ర గుర్తింపు ప‌త్రాలు అంటూ అడ్మిష‌న్ ను నిరాక‌రించొద్దంది. కరోనా వైరస్ వ్యాప్తి నివార‌ణ‌కు కేంద్రం మార్చి 24 న లాక్ డౌన్ ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆర్థిక కార్య‌క‌లాపాలు నిలిచిపోవ‌డంతో కూలీలు, వ‌ల‌స కార్మికులు ప‌నిచేసే ప్ర‌దేశాల‌ను వ‌దిలి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో పిల్ల‌ల చ‌దువుల‌కు ఎటువంటి ఆటకం క‌ల‌గ‌కుండా ఉండేందుకు హెచ్ఆర్డీ తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది.

@ విద్య నాణ్యతను పెంచడానికి, ఆన్‌లైన్ విద్యను ముందుకు తీసుకెళ్లడానికి మార్గదర్శకాలు తోడ్ప‌డుతాయని మార్గ‌ద‌ర్శ‌కాల విడుద‌ల సంద‌ర్భంగా హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. పాఠశాలల బాధ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు సహా అంద‌రికీ ఈ మార్గదర్శకాలు ఉపయోగకరంగా ఉంటాయని పోఖ్రియాల్ పేర్కొన్నారు.
@ మార్గదర్శకాలు ప్రతిని ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి పొందండి .

Attachment Copy:

@ Government of India : PRAGYATA - Guidelines for Digital Education