Friday 28 May 2021

TS Teacher's Diary:28.05.20211).పాఠశాల విద్య పర్యవేక్షణకు.. కమాండ్‌ సెంటర్‌ ప్రతి రాష్ట్రం ఏర్పాటు చేయాలి
_ సమస్యలు చెప్పుకోవడానికి హెల్ప్‌లైన్‌ అందుబాటులోకి తేవాలి
_ డిజిటల్‌ పాఠాలు వినే వీల్లేని వారి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి
_  మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర విద్యాశాఖ
     కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది అందరికీ సమాన విద్య అందలేదని భావిస్తున్న కేంద్రం ఈసారి పకడ్బందీ పర్యవేక్షణకు నడుం బిగించింది. వచ్చే విద్యా సంవత్సరం(2021-22)లో ప్రతి విద్యార్థికీ విద్యను అందించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. వెంటనే కంట్రోల్‌ అండ్‌ కమాండ్‌ సెంటర్‌(సీసీసీ)ను ఏర్పాటుచేయాలని కేంద్ర విద్యాశాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందులో విద్యావేత్తలు, ఇతర విద్యాపరమైన సమస్యలను పరిష్కరించే అధికారులను నియమించాలని మార్గదర్శనం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బడి మానేసే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన కేంద్రం.. జూన్‌ 30వతేదీ వరకు సర్వే నిర్వహించి బడికి రాని వారిని గుర్తించి విద్యనందించాలని కోరింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కీలక పాత్ర వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. అభ్యసన నష్టాన్ని పూడ్చేందుకు, విద్యార్థి ఇంటి వద్ద చదువుకునేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేలా చొరవ చూపాలని స్పష్టంచేసింది.
కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటు లక్ష్యమిదీ...
పాఠశాలల్లో చేరిన/చేరని విద్యార్థులు, డ్రాపౌట్లు, బాలకార్మికులకు సంబంధించిన సమాచారం, పాఠ్య పుస్తకాల సరఫరా, ఉపాధ్యాయుల అందుబాటు, పాఠశాలల అవసరాలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సీసీసీ నుంచి పర్యవేక్షణ ఉంటుంది. బడుల అవసరాలు, మెరుగైన బోధన అందించడంలో ఎదురయ్యే సమస్యలకు నిపుణులు పరిష్కారం చూపే వీలుంటుంది. ఇక్కడుండే విద్యావేత్తలు ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేయొచ్చు.

ఇంకా ఏమేం చేయాలంటే...
* విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ సందేహాలను, సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చేందుకు, వాటికి పరిష్కారం చూపేందుకు అనువుగా హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ప్రారంభించాలి.
* పాఠశాలలు, గ్రామాల వారీగా విద్యార్థుల హాజరుపట్టిక(రిజిస్టర్‌)ను తయారుచేయాలి. అందుకు తల్లిదండ్రులు, గ్రామ పంచాయతీ, ఉపాధ్యాయులతో కమిటీలు నియమించాలి. పిల్లలు ఏం చేస్తున్నారో నిత్యం తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలను అందించి టీవీలు, యాప్స్‌, వాట్సాప్‌ ద్వారా బోధించే ఏర్పాట్లు చేయాలి.
* ప్రతి 10 మంది పిల్లలను ఒక ఉపాధ్యాయుడు పర్యవేక్షించాలి. ఆ పిల్లల అభ్యసన సామర్థ్యాల బాధ్యత ఆయనదే.    పిల్లలతో నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతూ వారికి అవసరమైన సూచనలు ఇవ్వాలి. వారి మానసిక స్థితిని అంచనా వేస్తూ తగిన సలహాలు ఇవ్వాలి.
* డిజిటల్‌ పాఠాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన దీక్ష పోర్టల్‌ను అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు.
* బడులు తెరవని పరిస్థితులు తలెత్తే పక్షంలో స్మార్ట్‌ఫోన్‌/ల్యాప్‌ట్యాబ్‌/ ఇలాంటి ఉపకరణాలు లేని వారికి కూడా  విద్య అందించే ప్రణాళిక ఉండాలి. గ్రామాల్లో చదువుకున్న యువతను వాలంటీర్లుగా నియమించుకుని చదువు చెప్పించాలి. స్వచ్ఛంద సంస్థలు, దాతల సాయం లేదా సీఎస్‌ఆర్‌ నిధులతో డిజిటల్‌ పాఠాలు వినేందుకు అవసరమైన పరికరాలు అందించేలా చూడాలి.
* టీవీల ద్వారా ప్రసారమయ్యే పాఠాలు వినలేని వారి కోసం వైబ్‌సైట్‌ రూపొందించాలి. ఆయా పాఠాలను అందులో నిక్షిప్తం చేయించి, అవసరమైనప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకొని వినే సదుపాయం కల్పించాలి.
@@@@@
2).🔊తెలుగులో ఇంజినీరింగ్‌ విద్య
*మరో ఏడు ప్రాంతీయ భాషల్లోనూ బోధన
*🍥వచ్చే విద్యాసంవత్సరం అమలు: ఏఐసీటీఈ
*💫దేశవ్యాప్తంగా 500 కాలేజీలు దరఖాస్తు*
🌍ఇప్పటివరకు ఇంగ్లిష్‌లోనే అభ్యసించిన ఇంజనీరింగ్‌ విద్య ఇకపై తెలుగులోనూ చదువుకోవచ్చు. ఇంటర్‌ వరకు తెలుగులో చదివి ఇంజినీరింగ్‌లో ఇంగ్లిష్‌తో కుస్తీపట్టలేక ఇబ్బందిపడే విద్యార్థులకు కష్టాలు తీరినట్టే. జాతీయ విద్యా పాలసీ-2020 ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. అందులో భాగంగా అండర్‌ గ్రాడ్యుయేషన్‌, డిప్లోమా కోర్సులను ఇకపై ప్రాంతీయ భాషల్లో బోధించాలని ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) ప్రణాళికలు రూపొందించింది. తెలుగు, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళం, గుజరాతీ, కన్నడ, మలయాళం మొత్తం ఎనిమిది ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యాబోధనకు అనుమతిచ్చింది. ప్రస్తుతానికి అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ఇంజినీరింగ్‌, అందులోనూ మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఇతర సంప్రదాయ కోర్సులను ప్రాంతీయ భాషలో అభ్యసించే అవకాశాన్ని కల్పించారు.

*🌀వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రాంతీయభాషను అమలుచేయనున్నారు. భవిష్యత్‌లో మరో 11 ప్రాంతీయ భాషల్లోనూ సాంకేతిక విద్యను అందించనున్నట్టు ఏఐసీటీఈ ప్రకటించింది. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అందించే కళాశాల కచ్చితంగా నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రెడిటేషన్‌ పొందడమే గాక, ఆయా రాష్ర్టాల్లో బోధనలో అగ్రస్థానంలో ఉండాలి. మెరుగైన ప్రమాణాలను కలిగిన, స్వయంప్రతిపత్తి సంస్థలకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఒక్కో విభాగంలో బ్యాచ్‌కు 30-60మంది విద్యార్థులతోనే కోర్సు ప్రారంభించాలి. మాతృభాషలో బోధించేందుకు దేశవ్యాప్తంగా 500 కళాశాలలు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోగా తెలంగాణ, ఏపీ నుంచి 50 కిపైగా కళాశాలలు దరఖాస్తు చేశాయి.
@@@@@
3). జులై 15 తర్వాత ఇంటర్‌ పరీక్షలు!
రోజుకు రెండు విడతలుగా నిర్వహణ
పరీక్ష సమయం గంటన్నరకు కుదింపు
కేంద్రానికి లిఖితపూర్వకంగా   తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ
: రాష్ట్రంలో జులై 15వతేదీ తర్వాత ఇంటర్‌ వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు తెలిపింది. పరీక్షల నిర్వహణపై లిఖితపూర్వకంగా అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం కోరిన నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. జులై మధ్యలో పరీక్షలు మొదలుపెడతామని, ఆగస్టు చివరి నాటికి ఫలితాలు వెల్లడిస్తామని అందులో పేర్కొన్నారు. లేఖలో ఇంకా ఏమేం చెప్పారంటే..
ప్రశ్నలు తగ్గిస్తాం
* గతంలోనే ప్రశ్నపత్రాలు ముద్రణ పూర్తయినందున విధానాన్ని మార్చడం వీలుకాదు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి గంటన్నరకు తగ్గిస్తాం. సమయం తగ్గినందున రాయాల్సిన ప్రశ్నలనూ ఆ మేరకు తగ్గిస్తాం. దానివల్ల విద్యార్థులకు ఛాయిస్‌ పెరుగుతుంది. వచ్చిన మార్కులను 100కి లెక్కిస్తాం.
* సాధ్యమైనంత వరకు వ్యక్తిగత దూరం పాటించేలా చూస్తాం. అందుకు అనుగుణంగా వేర్వేరు ప్రశ్నపత్రాలతో  ఉదయం, సాయంత్రం పరీక్షలు జరుపుతాం. దానివల్ల విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. కరోనా వ్యాప్తికి అవకాశం ఉండదు.
* కొవిడ్‌ లేదా ఇతర కారణాల వల్ల పరీక్షలు రాయలేని వారికి మరో అవకాశం ఇస్తాం.
ప్రయోగ పరీక్షలు వాయిదా
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులకు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రయోగపరీక్షలు నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన ఇంటర్‌బోర్డు వాటిని వాయిదా వేసింది. జూన్‌ మొదటి వారంలో పరిస్థితిని సమీక్షించి, ఎప్పుడు నిర్వహించాలనే విషయమై నిర్ణయం తీసుకుంటామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ గురువారం తెలిపారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండటం, కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
@@@@@

@    Today's Service Info: 

        #    Service Rules

@    Today's TET & TRT Material Info :

        #    10th Class Bio Science EM