సందేహాలు - సమాధానాలు
FAQ - SENIORITY
ప్రశ్న:*ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు కేవలము మెరిట్ మాత్రమే తీసుకుంటారా? లేకపోతే రిజర్వేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుందా?
*ప్రస్తుతానికి సీనియారిటీ లిస్ట్ ప్రతి జిల్లాలో మెరిట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ప్రమోషన్లకి సీనియారిటీ లిస్ట్ ప్రాదిపదికన ఇస్తారా?
*అసలు సీనియారిటీ లిస్ట్, మెరిట్ లిస్ట్ ,రోస్టర్ కమ్ మెరిట్ లిస్ట్ వీటి మధ్య తేడాలు
పై విషయాలపై మీకున్న అవగాహనతో వివరించగలరని మనవి.
సమాధానము:
*రోష్టర్ అనేది ఒక పోస్ట్ భర్తీ చేసే సమయంలో ఆ పోస్ట్ ఏ కేటగిరీ వారితో భర్తీ చేయాలి అనేది గుర్తించడానికి ఉపయోగించే రిజిస్టర్.
*ఉదాహరణకు ఏదైనా నోటిఫికేషన్/పదోన్నతులు ఇవ్వాలి అనుకుంటే ముందు ఆ పోస్టులో ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది గుర్తించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 30 పోస్టులు ఖాళీ ఉన్నాయని గుర్తించడం జరిగింది.
*తరువాత ఆ ఖాళీలు సర్వీస్ రూల్స్ లో చెప్పిన విధంగా ఏ విధంగా భర్తీ చేయాలి అనేది గుర్తించాలి. (డైరెక్ట్ రిక్రూట్మెంట్, ప్రమోషన్, అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్, కన్వర్షన్). దీనికి సర్వీస్ రూల్స్ లో చెప్పిన సైకిల్స్ కోసం ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా ఖాళీగా ఉన్న 30 పోస్టుల్లో 12 పోస్టులు పదోన్నతి ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గుర్తించడం జరిగింది.
*ఇప్పుడు మనం పదోన్నతి ఇవ్వడానికి అవకాశం ఉన్న 12 పోస్టులు ఏ కేటగిరీ ల నుండి తీసుకోవాలి అనేది గుర్తించాల్సి ఉంది. దీని కోసం రోస్టర్ రిజిస్టర్ నిర్వహిస్తారు. ఆ రిజిస్టర్ ప్రకారం 12 పోస్టుల్లో 9 జనరల్, 2 SC, 1 ST ఉంది అనుకుందాం. (పదోన్నతులు ఇచ్చే సందర్భంలో అడక్వసీ చూడాలి. అంటే మనం ఏ పోస్టులో భర్తీ చేయాలని భావిస్తున్నామో, ఆ పోస్టులలో ఆ కేటగిరీ వారు సరిపడా ఉంటే ఆ కేటగిరీ వారికి రిజర్వేషన్ వర్తించదు.)
*ఇప్పుడు మనం పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చే సందర్భంలో మనం పదోన్నతి కల్పించాల్సిన ఉద్యోగులను పిక్ చేసుకోవడానికి ఉపయోగించే మొదటి జాబితా సీనియారిటీ లిస్ట్. ఈ లిస్ట్ సాధారణంగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.
*అయితే సీనియారిటీ లిస్ట్ లో ఉన్న అందరూ పదోన్నతులు అర్హులు కాకపోవచ్చు. టెస్టులు పాస్ కానీ వారు ఉంటారు, ట్రైనింగ్ పూర్తి కాని వారు ఉంటారు. క్రమశిక్షణా చర్యలు పెండింగ్ ఉన్నవారు ఉంటారు. పనిష్మెంట్ పీరియడ్ లో ఉన్నవారు ఉంటారు. అలాగే సెలక్షన్ పోస్టుల విషయానికి వచ్చేసరికి వార్షిక రహస్య నివేదికలు గత ఐదేళ్ల లో ప్రతికూల రిమార్కులు ఉన్నవారు ఉంటారు. రిటైర్ అయినా, చనిపోయినా, రిజైన్ చేసినా కూడా ఇందులో ఉంటారు.
*ప్రతీ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి ఈ సీనియారిటీ లిస్ట్ నుండి రాబోయే ఏడాది కాలంలో పదోన్నతి వచ్చే అవకాశం ఎంతమందికి ఉందో అంచనా వేసి పైన చెప్పిన అనర్హులను తీసివేసి అర్హులతో ఒక జాబితా తయారు చేసుకోవాలి. ఈ జాబితాను ఆమోదించే అధికారం సెలెక్షన్ పోస్టుల విషయం లో స్క్రీనింగ్ కమిటీ కి, డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ (DPC) కి ఉంటుంది. నాన్ సెలెక్షన్ పోస్టుల విషయంలో నియామక అధికారికి ఉంటుంది.
*ఇలా ఆమోదం పొందిన జాబితా (ప్యానెల్) నుండి ఖాళీలు ఏర్పడినపుడు నియామక అధికారి పదోన్నతులు ఇచ్చుకుంటూ వస్తారు. ఇలా ఇచ్చేటప్పుడు భర్తీ చేయాల్సిన రోస్టర్ పాయింట్ చూస్తారు. జనరల్ అయితే ప్యానెల్ లో మొదట ఉన్నవారికి ఇస్తారు. ఒకవేళ అది రిజర్వుడు రోస్టర్ పాయింట్ అయితే ఆ కేటగిరీ లో మొదట ఉన్నవారికి ఇస్తారు. ఇలా తదుపరి ఏడాది ఆగస్టు 31 వరకు ఏర్పడిన ఖాళీలను ఈ జాబితాలో ఉన్నవారితో తదుపరి ఏడాది డిసెంబర్ వరకు ఇచ్చుకోవచ్చు.